Thursday 1 November 2012


గూగుల్ ‘నెక్సస్’ వరద!
నెక్సస్ -7తో టాబ్లెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన గూగుల్ కంపెనీ మరో ముందడుగేసింది. లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ జెల్లీబీన్‌తోపాటు మూడు రకాల స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ నెల 13వ తేదీ నుంచి మొదట కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ మూడు ఉత్పత్తులు రెండు మూడు నెలల్లో భారత్‌లోనూ లభించనున్నాయని అంచనా. అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఆ మూడు గూగుల్ ఉత్పత్తుల గురించి స్థూలంగా...

నెక్సస్ -4 స్మార్ట్‌ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌జీతోపాటు గూగుల్ తయారు చేసిన నెక్సస్ -4 స్మార్ట్‌ఫోన్ శక్తిమంతమైన క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4.7 అంగుళాల (320 పీపీఐ) డిస్‌ప్లేతో యూట్యూబ్, ఫొటోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసుకునేందుకు తీగల అవసరమేమీ ఉండదు. ఛార్జింగ్ సర్ఫేస్‌పై ఫోన్‌ను ఉంచితే చాలు. ఇక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ జెల్లీబీన్‌ను మరింత ఆధునికీకరించి 4.2 ఫ్లేవర్‌గా వాడారు. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫొటో స్ఫియర్ గురించి. పనోరమా ఫోటోలు తీసేందుకు ఉపయోగపడే ఫీచర్ ఇది. మీరు తీయాలనుకున్న ఫొటోలను రకరకాల యాంగిల్స్‌లో తీసి వాటన్నింటినీ పనోరమాగా మార్చేస్తుంది. టైపింగ్‌ను మరింత సులువు చేసేందుకు జెల్లీబీన్ 4.2లో గెస్చర్ టైపింగ్‌ను ఏర్పాటు చేశారు. మీరు టైప్ చేయాలనుకున్న పదాల్లోని అక్షరాలపై వేళ్లను పైపైన కదిలిస్తే చాలు.. పదం టైప్ అవుతుందన్నమాట. 

మరింత పలుచగా నెక్సస్ -7
గూగుల్ కంపెనీ కొన్ని నెలల క్రితం విడుదల చేసిన టాబ్లెట్ పీసీ ఇది. మరింత ఆధునికీకరించి... జెల్లీబీన్ 4.2 ఆపరేటింగ్ సిస్టమ్‌ను జోడించి తాజాగా విడుదల చేశారు. 16 గిగాబైట్ల స్టోరేజీ సామర్థ్యమున్న నెక్సస్ -7 దాదాపు రూ.11 వేలకు అందుబాటులో ఉండగా 32 గిగాబైట్ల టాబ్లెట్ ఖరీదు రూ.14 వేల వరకూ ఉంటుంది. హెచ్‌ఎస్‌పీఏ+ మొబైల్ డేటా ఆప్షన్‌తోపాటు కావాలనుకుంటే మరో మూడు వేల రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎన్‌విడియా టెగ్రా -3 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వచ్చే నెక్సస్ -7తో ఏకకాలంలో అనేక అప్లికేషన్లను సులువుగా రన్ చేసుకోవచ్చునన్నమాట. తొమ్మిది గంటల వీడియో ప్లేబ్యాక్, పది గంటల వెబ్ బ్రౌజింగ్ చేసుకోగల బ్యాటరీ దీని సొంతం. 

నెక్సస్ -10
 ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని టాబ్లెట్లకంటే ఎక్కువ రెజల్యూషన్ ఉన్న స్క్రీన్ దీని సొంతం. శాంసంగ్ కంపెనీతో కలిసి తయారు చేసిన 10 అంగుళాల ఈ నెక్సస్ -10 టాబ్లెట్ కూడా జెల్లీబీన్ 4.2తో పనిచేస్తుంది. అంతేకాదు... దాదాపు తొమ్మిది గంటల వీడియో చూసేందుకు వీలుకల్పించే శక్తిమంతమైన బ్యాటరీను ఏర్పాటు చేశారు దీంట్లో. ఫ్రంట్ స్పీకర్ల కలిగి ఉండే ఈ టాబ్లెట్‌పై సినిమా చూడటం ఓ అనుభూతిగా మిగిలిపోతుందని కంపెనీ చెబుతోంది. ఒకే టాబ్లెట్‌ను ఎక్కువ మంది ఉపయోగించుకునే సందర్భాల్లో ఎవరికివారు తమదైన హోమ్ స్క్రీన్లను ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. టాబ్లెట్‌ను ఆన్ చేసి మీ ఫొటోపై తడితే చాలు.. మీకే సొంతమైన హోమ్‌స్క్రీన్ ప్రత్యక్షమవుతుంది.








 

No comments:

Post a Comment